24, జనవరి 2021, ఆదివారం

యంత్ర భయం

 

యంత్ర భయం

అమ్మో... కృత్రిమ మేధస్సు కలిగిన యంత్రాలు మానవులని సర్వనాశనం చేస్తాయేమో !

మానవుల మేధస్సు వలే పని చేయగలిగిన యంత్రాలు మానవుని జీవనోపాధిని మింగేస్తాయేమో !

మొన్నామధ్య  టెస్లా అధినేత యంత్రాల మేధస్సు ఎల్లలు దాటితే  ఎన్నో ప్రమాదాలకు దారి తీయచ్చు అనే భయాన్ని వ్యక్త పరచగానే ఎన్నో చర్చలు మొదలయ్యయి. వీటిలో నిజాలు ఎన్ని ? అసలు కృత్రిమ మేధ అంటే ఏంటి ?

మానవులకే కాదు బోలెడు జీవ రాసిలో   వేల సంవత్సరాల పరిణామక్రమంతో పరిపుష్టమైన మస్తిష్కం ఒక అధ్బుతం. దీనివలన ప్రసరించే చైతన్యం, వివేకం , తెలివితేటలు వేల సంవత్సరాలుగా ఎందరో మహానుభావులని వీటి పుట్టుక,  పదార్ధాలతో సంబంధం గురించి ఆలోచించేలా చేశాయి.
బొమ్మలకు అటుతరువాత యంత్రాలకు అటువంటి మస్తిష్కం సాధ్యమేనా అనేది పాత ప్రశ్నే!  యాభయ్యవ దశకంలో లిస్ప్ శృష్టి కర్త మెకార్తీ ఉపయోగించిన   కృత్రిమ మేధ అనే ఈ పదం ఎప్పటికప్పుడు కొత్త అర్ధాన్ని వ్యక్తపరుస్తూనే వుంది.

  ఆ రంగంలో పని చేస్తున్నవారికి ఆ పదాన్ని ఎలా వాడాలో దాని పరిమితులేంటో బాగా తెలుసు. ఎటొచ్చీ పేరు మాత్రమే విన్నవారికి, నవలలు, చలన చిత్రాల వలన ఒక అద్బుతమయిన ఇంద్రజాల సదృశంగా గోచరిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఆ పరిజ్ఞ్యాన లేమి  భయాన్ని కూడా కలిగిస్తూ వుంటుంది. 

ఎన్నో రకాల సమస్యలను సాంఖ్యకశాస్త్ర [statistics] పద్దతులు ఉపయోగించి గణన యంత్రాల సహాయంతో సమాధానాలను అంచనా వేస్తూ, తప్పులు వచ్చినప్పుడు ఆ సంఖ్యలను సరిచేసుకుంటూ ఒక ప్రత్యేక అవసరం కోసం రూపొందించిన ఈ యంత్రాలు మానవ మస్తిష్కానికి పోటీ కాలేవు అని కొందరి అభిప్రాయం.

మరి చదరంగం , గో లాంటి (గూగుల్ వారి ఆల్ఫా గో) వాటిలో అబ్బురపరిచే విజయాల మాట ఏమిటి ?  తనంతట తానుగా గో లాంటి క్లిష్టమయిన ఆటను నేర్చుకుని దానిలో  ప్రపంచ విజేతగా నిలవటం వెనుక మానవ మేధస్సు వుంది.  సంవిశ్వాస (Reinforcement Learning) గణనాల ద్వారా, వేల వేల ఉదాహరణలతో లెక్కకు అందని యంత్ర శక్తితో లెక్కిచగా ఒక పని చెయ్యటం సాధ్యపడుతుంది. దీనిలో కొందరు శృజనాత్మకతని చూస్తున్నారు .. కొందరు లెక్కలే అని  కొట్టి పారేస్తున్నారు.  
 
ఈ కృత్రిమ మేధ రేపో మాపో రాబోయే యంత్రం కాదు నిన్నా మొన్నా ఈ రోజూ  మన జీవితాలతో పెన     వేసుకుపోయింది. మన చరవాణిలో మనకి సమాయానుకూలంగా చూపించే సందేశాల మొదలుకుని మనకి జాలవాటిలో  కనిపించే  ప్రకటనల దాకా కృత్రిమ మేధా పద్దతుల సాక్షాత్కారమే. నిన్న వచ్చిన కరోనా మహమ్మారికి మందు, రేపు రాబోయే రవాణా వ్యవస్థల సమర్ధతకి ఇదే కుడిభుజం. 

  

ఉపయోగకరమయిన పేలుడు పదార్ధాలు తయారు చేసిన నోబెల్ ఆ పదార్ధాలు తరువాతి కాలంలో లక్షల ప్రాణాలు బలికోంటుందని ఊహించి వుండకపోవచ్చు . అలాగే ఈ మేధ ప్రాణాంతకమయిన ఆయుధాల తయారీలో ఇప్పటికే ముఖ్య భూమికని పోషిస్తోంది అనటంలో సంశయం అనవసరం. ఈ భయంతో ప్రగతికి అడ్డుకర్రలు వెయ్యలేము. పాలకులు దుండగుల ని ఒక కంట కనిపెడుతూనే  ఈ రంగంలో జరిగే అభివృద్ధి తో భాష , వ్యవసాయం , అక్రమాలకు అడ్డుకర్ర , అరోగ్య వ్యవస్త మరియూ పాలనలో సమర్ధత లాంటి ఎన్నో ఉపయోగాలను అందిపుచ్చుకోవచ్చు . 
 
భారత్ కు సంబంధించినంత వరకూ ఈ రంగంలో ప్రభుత్వం ఉదాసీనత చూపుతోంది అనటం కాదనలేని సత్యం.  ప్రజలకు అర్ధమయ్యేలాగ వారి భాషల్లో విషయాలని ప్రచురించకపోవటం మొదలుకుని పరాయి భాషల్లో విద్యావవస్థ వల్ల కోట్ల మందిని ఈ విప్లవంలో భాగస్వాములు కాకుండా నిరోధిస్తున్నాయి.  ఈ పరిజ్ఞాన లేమిని దుండగులు వారి లాభాలకు వాడుకున్నా మనం చూస్తూ వుండటం వినా చెయ్యగలిగినది శూన్యం.

 

 
ఇందులో యంత్రాలకన్నా,  వాటి మేధ కన్నా  భయపడాల్సినది యాంత్రిక విద్యా  వ్యవస్థకు , ఉదాసీనతకు.


        


   కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖంగా ..

రామ కోటి

ఐఫొన్లో మాత్రమే సరిగ్గా పనిచేస్తోంది.. బోలెడు తప్పులూ నిదానంగా రామజపం చేస్తూ కిందకి వెళ్ళండి .. సర్రున లాగేస్తే పని చెయ్యదు :-) ...